Tuesday, April 15, 2014

2005 లో ఒక తెలుగు వెబ్ సైట్ కొరకు నేను రాసిన ఆర్టికల్

ఈ సంవత్సరం నవంబర్‌ 1న శని సింహరాశిలో ప్రవేశించాడు. ఈ గోచార ప్రభావం భారతదేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ పై అధికంగా ఉండే అవకాశమున్నది. ముండేన్‌ ఆస్ట్రాలజీ ప్రకారం భారత దేశం మకర రాశి పరిపాలనలోకి, ఆంధ్రప్రదేశ్‌ సింహరాశి పాలనలోకి వస్తాయి. రాశ్యాధిపతియైన శని అష్టమరాశియైన సింహంలో సంచరిస్తూ షష్టాష్టమయోగాన్ని ఇవ్వటం వలన రాజకీయ, క్రీడా, సినిమా రంగాలపై అధిక ప్రభావాన్ని చూపే అవకాశమున్నది. శని సామాన్యప్రజానీకానికి, కార్మిక, కర్షకవర్గాలకు, సీనియర్లకు కారకుడైతే, సింహరాశి రాజకీయాలకు, పరిపాలన వ్యవస్థకు, క్రీడలు, ఎంటర్‌ టైన్‌ మెంట్‌ రంగాలకు కారకత్వం వహిస్తుంది. ఈ రెండు భిన్నధృవాల కలయిక కారణంగా పై రంగాలలో ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకునే అవకాశమున్నది. రాజకీయంగా సింహరాశిలో శని సంచారం అధికారులకు, పదవులలో ఉన్న వారికి సమస్యలను తెచ్చే అవకాశమున్నది. ప్రజలనుంచి కొంత వ్యతిరేకత, కొత్త పార్టీలు, కలయికలు ఏర్పడే అవకాశముంటుంది. తన మూలత్రికోణ రాశి నుంచి శని అష్టమంలో సంచరించటం వలన క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించిన వ్యక్తులు రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రావటం కాని, పరోక్షంగా అధికారపక్షానికి సమర్థన అందజేయటం కానీ జరుగుతుంది. క్రీడారంగంలో ప్రక్షాలన జరిగే సమయమిది. రాబోయే రోజుల్లో క్రీడారంగానికి సంబంధించి చాలా మార్పులు చోటుచేసుకునే అవకాశమున్నది. చాలామంది కొత్త క్రీడాకారులు విజయాలను సాధించి ప్రజల మన్ననలు పొందుతారు. సీనియర్‌ ఆటగాళ్లలో చాలామందికి ఉద్వాసన చెప్పటం కానీ, హోదాలో తగ్గుదల కానీ చోటుచేసుకుంటుంది. సినీ, ఎంటర్‌ టైన్‌ మెంట్‌ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రత్యక్షరాజకీయాల్లోకి దిగే అవకాశమున్నది. సినీ, రాజకీయ, క్రీడారంగాలకు సంబంధించి ప్రక్షాలన జరిగే సమయమిది. పాత తరాలు, ఎంతోకాలంగా ఈ రంగాల్లో ప్రముఖులుగా ఉంటున్నవారు కొంత వ్యతిరేకతను, స్థాయి తగ్గటాన్ని ఈ శని గోచారం సూచిస్తున్నది. మొత్తానికి ఈ గోచారం కారణంగా అయా రంగాల్లో పాతనీరు పోయి కొత్తనీరు వచ్చే అవకాశమున్నది.

No comments:

Post a Comment

Thanks for your comment.